ఏర్పాట్లు పూర్తి చేశాం
మహిమాన్వితురాలు
● భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి ● రేపు అవ్వ జాతర ● తరలిరానున్న భక్తజనం
ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వ కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఆదోని పట్టణంలో వెలిసిన అవ్వను భక్తులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఈనెల 9వ తేదీన శనివారం అవ్వ జాతర సందర్భంగా వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారుజామున అవ్వ వారి సమాధి, మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, పూల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అవ్వ విగ్రహాన్ని వెండి రథంలో ఉంచి పురవీధుల్లో ఊరేగించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయం ముందు చలువ పందిళ్లు వేశారు. ఇన్‌చార్జి డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 25 శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయాలు వెలిశాయి. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి, సిరుగుప్ప తాలూకా రారావిలో కూడా అవ్వ వారి ఆలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ పూజలందుకుంటున్నారు.
ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామంలో దళిత మంగమ్మ, బండెప్ప దంపతుల కుమార్తె లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో గ్రామస్తులు తిక్కమ్మగా పిలిచేవారు. పెళ్లీడు రావడంతో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన మారెప్పకు ఇచ్చి వివాహం చేశారు. ఓరోజు ఆమె తన భర్తకు శక్తిస్వరూపిణిగా కనిపించడంతో అతడు భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. కొన్ని రోజుల తర్వాత సిరుగుప్ప నుంచి ఆదోనికి చేరుకుని పుర వీధుల్లో సంచరించే వారు. పట్టణ ప్రజలకు తరచూ ఆమె రకరకాల మహిమలు చూపుతుండడంతో మహాయోగిగా భావించి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందటం ప్రారంభించారు. ఆమె దుకాణాల వద్దకు వచ్చిపోతే వ్యాపారం బాగా జరుగుతుందనే నమ్మేవారు. సంతానం లేని వారికి అమ్మవారిని కలిసి వేడుకుంటే సంతానం కలిగేదని భక్తుల నమ్మకం. రోజురోజుకూ మహిమలు చూపడం ఎక్కువ కావడంతో తిక్క లక్ష్మమ్మను మహాయోగిగా పిలిచేవారు. అమ్మవారు జీవించిన కాలంలోనే ఓ పెద్ద కుర్చీలో ఉంచి పల్లకీ సేవగా ఊరేగించే వారు. 1933లో పట్టణంలో జీవసమాధి అయ్యారని ఆలయ నిర్వాహకులు రాచోటి రామయ్య, రాచోటి సుబ్బయ్య తెలిపారు.
రథోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులు అందరికీ అన్నదానం నిర్వహిస్తున్నాం. శ్రీభగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అవ్వవారి పేరుమీద ఉచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యోగా సాధన, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నాం.
– రాచోటి రామయ్య, ఆలయ ధర్మకర్త


