దేవుడి భూమి స్వాహా! | - | Sakshi
Sakshi News home page

దేవుడి భూమి స్వాహా!

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

● ఆంజనేయస్వామి మాన్యం ● రెవెన్యూ రికార్డులు తారుమారు

భూమి దేవుడికే చెందాలి

అధికారులు స్పందించాలి

అన్యాక్రాంతం

నందవరం: రెవెన్యూ రికార్డులు కాదని కొందరు దేవుడి భూమిని సొంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ భూమిని పాతికేళ్లుగా అనుభవిస్తూ దర్జాను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన రీ సర్వేతో వారి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నందవరం మండలం నదికై రవాడి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి 23.97 ఎకరాల భూమి ఉంది. గ్రామం తూర్పు భాగంలో తుంగభద్రనదీ తీరంలో ఈ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరా ధర రూ.20 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలాంటి విలువైన భూమిని కొందరు సెట్లర్స్‌(వేరే ప్రాంతం నుంచి వచ్చి గ్రామంలో ఉండేవారు) ఆక్రమణదారులతో కలిసి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించారు. ఇబ్రహీంపురం కొట్టాలకు చెందిన సత్యనారాయణ, కృష్ణమూర్తిలతో దేవుడికి అర్చకులని చెప్పి షణ్ముఖ, వీరభద్రప్పలు మాన్యం భూమిని అనుభవిస్తున్నారు. వీరందరూ కలిసి మాన్యాన్ని అనుభవిస్తూనే రికార్డులు మార్చేశారు. కృష్ణమూర్తి 6 ఎకరాలు, సత్యనారాయణ 6 ఎకరాలు, వీరభద్రప్ప 5.93 ఎకరాలు, షణ్ముక 5.94 ఎకరాల చొప్పున అనుభవంలో ఉన్నట్లు చూపించుకున్నారు.

సర్వేకు అడ్డంకులు

దేవుడి మాన్యం ఆక్రమణ అయ్యిందని రీ సర్వేలో బయట పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఈ భూమిని రికార్డుల ఆధారంగా సర్వే చేసి తమకు స్వాధీన పరచాలని రెవెన్యూ అధికారులకు ఎండోమెంట్‌ అధికారులు విన్నవించుకున్నారు. విన్నపం మేరకు ఈ నెల 2న (శనివారం) మండల సర్వే అధికారి అక్బర్‌బాషా, గ్రామ సర్వేయర్లతో కలిసి సర్వే చేయడానికి వెళ్లగా అనుభవదారులు అడ్డుచెప్పారు. సర్వేకు దేవదాయ శాఖ అధికారులు రాకపోవడంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అడ్డంకిగా మారాయి.

దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేపట్టి భూమి దేవుడికి చెందేలా చూడాలి. గ్రామంలో ఆంజనేయ స్వామికి నిత్య పూజలు కరువయ్యాయి. ఆలయానికి సంబంధించి 23.97 ఎకరాలు దేవుడికి అప్పగిస్తే బాగుంటుంది.

– ఈడిగ వేణు

ఆక్రమణదారుల నుంచి దేవుడి మాన్యం విడిపించేంత వరకు పోరాడతాం. దేవదాయశాఖ, రెవెన్యూ, సర్వే అధికారులు గ్రామానికి వచ్చి సర్వే చేసి హద్దులు చూపించాలి. లేకపోతే విశ్వహిందూ పరిషత్‌తో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సర్వే చేపట్టాలి. – బోయ వెంకటేష్‌

Advertisement
 
Advertisement
Advertisement