కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలో నిల్వ
అనుమానం రాకుండా గోదాము ఏర్పాటు
రాజకీయనేతల ఒత్తిళ్లకు భయపడి!
కర్నూలు(సెంట్రల్): పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బడాబాబుల దరికి చేరుతోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలో నిల్వ ఉంచుతున్నారు. ఇందుకోసం నిర్జన ప్రాంతంలో గోదాము ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచే అక్రమ బియ్యం వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలోని గార్గేయపురం–నూతనపల్లెల మధ్య జాతీయ రహ దారి 340సీ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ గోదాము కనిపిస్తుంది. ఇందులో ఐదారు లారీల బియ్యాన్ని ఏక కాలంలో నిల్వ చేయవచ్చు. మనుషు లు కూడా సరిగా సంచరించని ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారానికి అనువుగా ఉంటుందని నిర్మించారు. ఇక్కడి నుంచి చౌక ధరల దుకాణాల డీలర్లు, ప్రజల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ గోదాములో కర్నూలు నగరం, కర్నూలు రూరల్ మండలం, కల్లూరు మండలం, మిడుతూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో అక్రమ మార్గాల ద్వారా సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ షాపుల డీలర్లు, ఇంటింటికీ వచ్చి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులు ఇక్కడకి వచ్చి విక్రయాలు చేస్తారని తెలుస్తోంది.
బియ్యం అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు పదే పదే చెబుతుంటారు. రేషన్ బియ్యాన్ని అమ్మినా..కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని చెబుతుంటారు. అయితే అక్రమ బియ్యం వ్యాపారం కళ్లముందే జరుగుతున్నా రాజకీయనేతల ఒత్తిళ్లు, డబ్బుకు ఆశపడి అక్రమార్కులకే సహకరిస్తున్నారన్నది బహిరంగ సత్యం. ప్రస్తుతం అక్రమ బియ్యం డంపుపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియడంలేదు.


