● కంటి అద్దాలకు బయటి దుకాణాలకు రెఫర్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కంటి అద్దాలను వైద్యులు సూచించగా, వాటిని ఫలానా దుకాణంలో తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగులు చెప్పి మరీ పంపుతున్నారు. కొందరు ఉద్యోగులైతే ఒక తెల్లకాగితంపై దుకాణం పేరు కూడా రాసి ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని, దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా వైద్యులు సూచించిన మేరకు అద్దాలను జగనన్న కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా తయారు చేసి పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకంను తీసివేశారు. అప్పటి నుంచి కంటి అద్దాలను రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. ఇలా వైద్యులు సూచించిన అద్దాలను రోగులే వారికి నచ్చిన దుకాణంలో కొనుగోలు చేసుకోవాలి. కానీ ఆసుపత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. ప్రైవేటు ఆప్టికల్స్ షాపులకు వీరే రోగులను పంపిస్తున్నారు. కొందరు దుకాణదారులు ఆసుపత్రిలోకి వచ్చి రోగులను వెంటబెట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఇలా రోగులను దుకాణాలకు పంపినందుకు గాను సదరు ఉద్యోగులకు తగిన మొత్తాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి వివరణ ఇస్తూ.. త్వరలో రోగులకు ఉచితంగా కంటి అద్దాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులను బయట దుకాణాలకు పంపే ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.


