● 30 సెంట్లలో ఆరు రకాల ఆకుకూరల సాగు ● రోజు రూ.800 నుంచి రూ.1,200 వరకు ఆదాయం
సి.బెళగల్: అహోరాత్రులు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న సమయంలో పోలకల్ గ్రామానికి చెందిన రైతు బూడిదపాడు మద్దిలేటి వినూత్నంగా ఆలోచించారు. తన ఎకరా పామాయిల్ తోటలో అంతర పంటలుగా ఆరు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి, రాబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తోటలో గతంలో అంతర పంటగా ఉల్లి పంటను సాగుచేయడంతో నష్టాలు వచ్చాయి. నష్టాల నుంచి బయటపడేందుకు తోటలో 30 సెంట్ల భూమిలో ఆరు రకాల ఆకుకూరలను పండించాలని సంకల్పించారు. తన సతీమణి అనంతమ్మతో కలసి పొలంలో పాలకూర, తోటకూర, గోంగూరు, కొత్తిమీర, మెంతికూర, చిరుకూర విత్తనాలను చల్లారు. ఆకుకూరల పంటలు త్వరగా కోతలకు రావడంతో ప్రతిరోజు పనులను చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజూ కోతలు కోసుకుని సొంతంగా గ్రామాల్లో తిరుగుతూ అమ్ముకుని అధిక లాభాలు పొందుతున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1,200ల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతు మద్దిలేటి తెలిపారు.


