బనగానపల్లె: భార్య హత్యకేసులో భర్త కొండగాళ్ల వెంకటస్వామిని గురువారం అరెస్టు చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. అతని సోదరులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్థానిక సీఐ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. బీరవోలు గ్రామానికి చెందిన వెంకటస్వామికి కొంత కాలంగా భార్య లక్ష్మీపై అనుమానం ఎక్కువైంది. గత నెల 29న కూలి పనికి వెళ్దామని భార్యను నమ్మించి తన మోటార్‌సైకిల్‌పై గ్రామ చివర ఉన్న గాలేరు నగరి కాల్వ వద్దకు వెళ్లారు. అక్కడే భార్యతో గొడవపడి హత్య చేసి మృతదేహానికి రాయి కట్టి పక్కనే ఉన్న బావిలో వేశాడు. రెండు రోజుల తరువాత అనుమానం వచ్చిన వెంకటస్వామి మళ్లీ బావి వద్దకు వెళ్లి చూడగా మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తన సోదరులైన వెంకటరమణ, శ్రీనివాసులను బావి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని బయటికి తీసి పక్కనే పూడ్చివేశారు. ఈనెల 2న మృతురాలి తల్లి నంద్యాల దేవనగర్‌కు చెందిన రాజోలి సుబ్బలక్ష్మీ తన కుమార్తె కనిపించడం లేదని, తన అల్లుడిపై అనుమానం ఉందని నందివర్గం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటస్వామితో పాటు సోదరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ చెప్పారు.


