శ్రీశైలంటెంపుల్: హిందూధర్మ ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడేంలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమంలో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడెంలో శోభయాత్ర అనంతరం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్లకు ప్రవర పఠించి, వరపూజ నిర్వహించి బాషికాలను అలంకరించారు. తరువాత భూమండలం, శ్రీశైల క్షేత్ర వర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగళ్యధారణ జరిపి, స్వామిఅమ్మవార్లకు తలంబ్రాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల వస్త్రాల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. స్వామిఅమ్మవార్లకు పునఃపూజలు జరిపి, ఆశీర్వచనం, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.


