● అమకతాడు పాఠశాల స్థలం ఆక్రమణ
● టీడీపీ నేత అండతో
నలుగురు ఇళ్ల నిర్మాణం
పాఠశాల గదుల తాళాలు అతని వద్దే..
స్థానిక టీడీపీ నాయకుడు వీరభద్రుడు అండదండలతో బోయ హనుహంతు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి పాఠశాలపై అజమాయిషీ చెలాయిస్తున్నాడు. పాఠశాల గదుల తాళాలు ఆయన దగ్గరే ఉంచుకొని అందులో పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్‌లు చెబుతున్నానని నమ్మిస్తూ మందుబాబులకు అడ్డాగా మార్చేశాడు. ప్రస్తుతం హెచ్‌ఎం ఆఫీసు తాళాలు, స్కూలు రికార్డులకు సంబంధించిన తాళాలు కూడా అతని దగ్గరే ఉంచుకొని పాఠశాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నాడని హెచ్‌ఎం ఫిర్యాదులో పేర్కొన్నారు.
కర్నూలు(సెంట్రల్): సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కార అవుతాయనేది అవాస్తమని ఈ కథనం చదివితే తెలిసిపోతుంది. కృష్ణగిరి మండలం అమకతాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీని స్థానిక టీడీపీ నాయకులు కూల్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ గతేడాది జూన్ 20వ తేదీన పాఠశాల హెచ్‌ఎం మంత్రి లోకేష్‌తో పాటు ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, డీఈఓలతో పాటు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. 11 నెలలు గడిచినా వారిలో ఒక్కరూ కూడా కనీసం విచారణ కూడా చేయలేదు. గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు సర్వే నంబరు 141లో 1.40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో పాఠశాల భవనం నిర్మాణంతో పాటు మిగిలిన స్థలాన్ని కలుపుకొని ప్రహరీని నిర్మించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరభద్రుడు ప్రోద్బలంతో అదే గ్రామానికి చెందిన బోయ సుధాకర్, తలారి మల్లికార్జున, వడ్ల ఈశ్వరయ్య, వడ్ల ఎల్లయ్య పాఠశాల ప్రవాహరీని కూల్చి స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. దీంతో 1.40 ఎకరాల్లో ప్రస్తుతం పాఠశాలకు 15 సెంట్లు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించి పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, వెల్దుర్తి సీఐ, డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కొందరికీ స్వయంగా ఇవ్వగా మరికొందరికీ ఈ–మెయిల్ ద్వారా హెచ్‌ఎం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి ఏడాది కావస్తున్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఈ క్రమంలో ఆక్రమణదారులు దర్జాగా పాఠశాల స్థలాన్ని అనుభవిస్తున్నారు.
చంపేస్తామంటూ బెదిరింపులు...
ప్రస్తుత పాఠశాల హెచ్‌ఎంగా ఉన్న వ్యక్తి టీడీపీ నాయకుల అక్రమాలను బయట పెట్టడంతో అతని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘నీవు ఎరుకులోడివి, నీకు ఇక్కడేమ పని.. నీ జీతం మా చేతల మీదుగా ఇప్పిస్తాం.. మా కింత జీతగాడిలా ఉండాలి’ అంటూ అవమాన పరుస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నాడని హెచ్‌ఎం వాపోతున్నాడు.


