రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

నంద్యాల: రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా శ్ఙ్రీవన్‌ మంత్‌ – వన్‌ విలేజ్‌ – ఫోర్‌ విజిట్స్‌శ్రీశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతి గురువారం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని, ఆ గ్రామాన్ని నెలలో నాలుగురోజులు అధికారులు సందర్శించాలన్నారు. ఈ బృందంలో తహసీల్దార్‌, ఎంపీడీఓ, వీఆర్‌ఓ, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, మండల సర్వేయర్‌, పంచాయతీరాజ్‌ విభాగం ఏఈ, సాగునీటి శాఖ అధికారులు, అవసరమైతే అటవీ శాఖ అధికారులు పాల్గొని గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందించడం, పెండింగ్‌ ఫిర్యాదులను తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి మండలంలో ప్రతి నెల ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు విడతలుగా కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. మొదటి విడతలో గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల ప్రదర్శన, సాధారణ సమస్యల పరిష్కారం చేపట్టాలన్నారు. రెండో విడతలో ఫీల్డ్‌ స్థాయి పరిశీలనలు నిర్వహించి వినతులపై విచారణ చేయాలని, మూడో విడతలో సమస్యల పరిష్కారం, ఆదేశాల జారీ, మ్యూటేషన్లు వంటి చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగో విడతలో గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. భూమి హక్కుల నమోదు, వెబ్‌ల్యాండ్‌ సమస్యలు, సర్వే నంబర్లలో పొరపాట్లు, సరిహద్దు వివాదాలు, మార్గ హక్కుల సమస్యలు, కుటుంబ భూ వివాదాలు, ఆక్రమణలు, ఖాతా మార్పిడి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందిన అన్ని ఫిర్యాదులను పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేసి, సమయపాలనతో పరిష్కరించాల్సిందిగా సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని, ప్రతి వారం కార్యక్రమ పురోగతిని స్వయంగా సమీక్షిస్తానన్నారు.

గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యల

పరిష్కారానికి ప్రత్యేక బృందం

ప్రతి గురువారం ఒక గ్రామంలో

అధికారులు పర్యటించాలి

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

Advertisement
 
Advertisement
Advertisement