నంద్యాల(అర్బన్): పంటలకు యూరియా, డీఏపీలను అవసరమైన మేరకే వాడాలని, మోతాదుకు మించి వాడితే భూసారం దెబ్బతింటుందని కేంద్ర బృందం సభ్యులు ఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్రయాదవ్, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుశేఖర్ పేర్కొన్నారు. యూరియా, డీఏపీ నిల్వల పరిశీలన నిమిత్తం నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏఓ వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రిజిస్టర్ బిల్లులు, క్రయవిక్రయాల రికార్డులు, ఈ పాస్ మిషన్ల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా విధానం, గత మూడేళ్లుగా యూరియా అమ్మకాల వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎరువులు రైతులకు అవసరమైన మేరకు సమృద్ధిగా ఉన్నాయని, ఆందోళనలతో ముందస్తుగా కొనుగోలు చేయవద్దని చెప్పారు. డీలర్లు ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, యూరియా, డీఏపీలకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు పచ్చిరొట్ట ఎరువులు అయిన జీలుగ, పిల్లిపెసర, 25 నుంచి 30 రకాల విత్తనాలు కలిగిన పీఎండీఎస్ కిట్లను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జయప్రకాష్‌రెడ్డి, గిరీష్, ప్రసాదరావు, పవన్, షేక్షావలి, మహేశ్వరరెడ్డి, నేతాజీ, నాగేశ్వరరెడ్డి, పీరునాయక్, కల్యాణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


