సంగపట్నంలో పది గడ్డివాములు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

సంగపట్నంలో పది గడ్డివాములు దగ్ధం

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

అవుకు(కొలిమిగుండ్ల): మండల పరిధిలోని సంగపట్నంలో ప్రమాదవశాత్తు బుధవారం పది గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి,బత్తుల ఈశ్వరరెడ్డి,చిన్న బయపురెడ్డి,చిన్న వెంకటసుబ్బారెడ్డి, నూర్‌బాషా, మల్లు శివశంకర్‌రెడ్డి పశువుల మేత కోసం పది గడ్డివాములను నిల్వ చేసుకున్నారు. గడ్డివాములకు సమీపంలో మొక్క జొన్న కోతలు కోసి వేస్టేజ్‌ను పక్కకు పడేయంతో వాటికి నిప్పు పెట్టారు. క్రమేణా మంటలు గడ్డివాములకు అంటుకున్నాయి. అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేకుండా పోయింది. పూర్తిగా గడ్డివాములు కాలిపోవడంతో సుమారు రూ.8లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు.

నిలిచిపోయిన నీటి విడుదల

గోనెగండ్ల: ఏపీవాట ఇండెంట్‌ పూర్తి కావడంతో తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదలను డ్యామ్‌ అధికారులు నిలిపివేశారు. దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్‌కు బుధవారం ఉదయం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరింది. సాయంత్రానికి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్‌ 1 నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదల కొనసాగింది.

హత్య కేసుగా మారిన అదృశ్యం కేసు

బనగానపల్లె: మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన లక్ష్మి(35) అదృశ్యం కేసు హత్య కేసుగా మారినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గొల్ల వెంకటస్వామి భార్య లక్ష్మిపై భర్త అనుమానంతో వారం రోజుల క్రితం సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు సహకారంతో గ్రామ సమీపంలోని గాలేరు నగరి కాల్వ వద్దకు ఆమెను తీసుకెళ్లి అక్కడే చంపి పూడ్చివేశారు. అయితే ఏమీ తెలియనట్లు ఈ నెల 2న తన భార్య కనిపించడంలేదని వెంకటస్వామి నందివర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. లక్ష్మి కొద్ది రోజులుగా అగుపించకపోవడంతో బంధువులు భర్తపై అనుమానం ఉందని, కేసు దర్యాప్తు చేయవలసిందిగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బనగానపల్లె సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐ భూపాలుడులు కేసు నమోదు చేసి విచారణ చేయగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామ, పోస్టుమార్టం చేశారు. భర్త వెంకటస్వామితో పాటు సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అడుగుకో గుంత

గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల నుంచి గంజిహళ్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. అడుగడుగున గుంతలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గోనెగండ్ల నుంచి గంజిహళ్లి మీదుగా బైలుప్పల, బి. అగ్రహారం తదితర గ్రామాలకు ఈ దారిలోనే వెళ్లాలి. గంజిహళ్లి చెరువు నుంచి ఇటీవల టిప్పర్లలో ఎమ్మిగనూరుకు మట్టి తరలించారు. ఈ వాహనాలు అధికలోడ్‌తో ఇష్టనుసారంగా వెళ్లాడంతోనే రోడ్డు దెబ్బతినిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారి బాగుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఉయ్యాలవాడలో పిడుగు

ఉయ్యాలవాడ: మండలంలో బుధవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు వీచాయి. రాత్రి 7.15 గంటల సమయంలో మండల కేంద్రం ఉయ్యాలవాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మండలకేంద్రంలో ఉన్న మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వగృహం ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు పోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పిడుగు పడిన శబ్ధానికి చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని నీటితో మంటలను అదుపు చేశారు. ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే భారీగా గాలులు వీచడంతో మండలంలో పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement