ఈతకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి..

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

నందికొట్కూరు: మండలంలోని బిజినవేముల గ్రామంలో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని ట్యాంక్‌ ఏరియాకు చెందిన షేక్‌ మహమ్మద్‌ అర్షద్‌ (33) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బిజినవేముల గ్రామ సమీపంలోని తిరుపతయ్యకు చెందిన వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు అర్షద్‌ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు గమనించి వెంటనే విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు బావి వద్దకు చేరుకొని గాలించగా విగతజీవిగా కనిపించాడు. నీటిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య రేష్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మహానంది: నంద్యాల నుంచి మహానంది వెళ్లే మార్గంలో ఆటో బోల్తా పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అబ్బీపురం గ్రామానికి చెందిన డమాల రవితేజ (20) ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి బుక్కాపురం గ్రామానికి వెళ్లి ఒక్కడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

రుద్రవరం: మండలంలోని మందలూరు గ్రామంలో సంజీవరాయుడు (43) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య పద్మావతి, కుమార్తె, కొడుకు ఉన్నారు. మృతుడి తండ్రి సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయప్ప తెలిపారు.

ఎరువు దుకాణాల లైసెన్స్‌ రద్దు

రుద్రవరం: మండలంలోని ఆలమూరు, మచినేనిపల్లె గ్రామాల్లోని మూడు రసాయన ఎరువుల దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు వ్యవసాయాధికారి సుమతి తెలిపారు. వ్యవసాయ పనులు ముగిశాక ఎరువులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం ఆలమూరులోని ప్రణవి ట్రేడర్స్‌, మాచినేనిపల్లెలోని శ్రీ విజయలక్ష్మి, శ్రీ బిందు ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు విక్రయించినట్లు తేలడంతో వాటి లైసెన్స్‌లను పది రోజుల పాటు రద్దు చేసినట్లు ఏఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement