● వృద్ధురాలి కడుపులో నుంచి
10 కిలోల కణితి తొలగింపు
కర్నూలు (టౌన్): కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. వృద్ధురాలి కడుపులో నుంచి ఏకంగా 10 కిలోల కణితి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. వెలుగోడు పట్టణానికి చెందిన 75 ఏళ్ల సుబ్బలక్ష్మమ్మ ఆరు నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంది. పలు ఆసుపత్రుల్లో చూపించుకున్నా నొప్పి తగ్గ లేదు. దీంతో గత నెల 22 వ తేది స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో 30x25 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన భారీ అండాశయ కణితిని గుర్తించారు. ఈనెల 1 వ తేదీన విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు నొప్పి తగ్గి ఆరోగ్యం కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన వారిలో వైద్యులు నరేష్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ సర్జికల్ అంకాలజిస్టు సందీప్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్టికల్ అంకాలజిస్టు భారతి, డాక్టర్లు సంధ్య, మాలిక్, కాంచనగౌరి, లక్ష్మి పాల్గొన్నారు. క్యాన్సర్‌ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


