కర్నూలు : నగరంలోని బుధవారపేటలోని చెన్నకేశవస్వామి గుడి ఆర్చి దగ్గర మున్సిపాల్టీకి చెందిన చెత్త సేకరణ లారీ ఢీకొని బైకిస్ట్ బంగి బద్రీనాథ్ (28) మృతిచెందాడు. ఈయన డిగ్రీ వరకు చదువుకుని ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. బుధవారం ఉదయం తన ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై తండ్రి బంగి రంగస్వామిని ఎక్కించుకుని ప్రభుత్వాసుపత్రి దగ్గర దింపి తిరిగి ఇంటికి వెళ్తుండగా బుధవారపేటలోని చెన్నకేశవస్వామి గుడి ఆర్చి వద్ద మున్సిపాల్టీ చెత్త లారీ ఢీకొనడంతో కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. లారీ టైర్ అతనిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికంగా ఉన్న మహిళలు మల్లీశ్వరి, సుంకులమ్మ చూసి మృతుని ఇంటి వద్దకు వెళ్లి తల్లి జయమ్మకు సమాచారం తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు.తన కుమారుడి మృతికి చెత్త లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటమే కారణమని జయమ్మ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.


