నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రోగుల రద్దీతో కాసేపు కూర్చుందామన్నా కుర్చీలు కనిపించవు.. దాహమేస్తే తాగేందుకు నీళ్లు ఉండవు.. వార్డుల్లో వైద్య సిబ్బంది పలకరు.. రోగులకు సహాయంగా వచ్చే కుటుంబీకుల పరిస్థితి మరీ దారుణం. వార్డులో ఉండనీయరు.. ఆసుపత్రి ఆవరణలో ఉండలేరు.. అన్నట్లుగా పరిస్థితి దాపురించింది. ఆసుపత్రి నిండా సమస్యలే కనిపిస్తున్నాయి. – బొమ్మలసత్రం
ఆసుపత్రికి ప్రతి రోజు 1500 మందికిపైగా చికిత్స కోసం వస్తుంటారు. వారి దాహం తీర్చేందుకు కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదు. ఆసుపత్రి బయట ఉన్న శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్‌లో నీరు తెచ్చుకుని దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఆసుపత్రిలో దాతలు ఇచ్చిన ఆర్‌వో ప్లాంట్‌ను మరమ్మతు చేయించకుండా అలాగే వదిలేశారు. వేసవి కాలం ఎంతో మంది నీటి కోసం ఆసుపత్రిలో వెతకాల్సిన పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రతి నెలా వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణులకు నేల పరీక్ష తప్పడం లేదు. వారితో పాటు వచ్చిన పిల్లలు, ఆశా వర్కర్లకు కూడా కష్టాలు పడుతున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉండాల్సిన కుర్చీలు మూలన పడ్డాయి. వాటికి చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి వస్తాయని తెలిసినా అధికారులు పట్టించుకోడం లేదు. గతంలో దాతలు ఇచ్చిన ఏసీలను సైతం ఆసుపత్రిలో కొందరు అధికారులు ఇళ్లకు తరలించినట్లు సమాచారం.
రోగులకు సహాయంగా ఉండాల్సిన సిబ్బంది పలకడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులను వీల్‌చైర్లు, స్టెచ్చర్స్‌ను తొసేందుకు రోగుల కుటుంబీకులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమస్యల నేపథ్యంలో పలువురు భారమైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం మేలని చర్చించుకుంటున్నారు.
రోగులతో పాటు వచ్చిన అటెండర్స్ ఉండేందుకు ఆసుపత్రిలో రెండు గదులు ఉన్నాయి. అవి చిన్నవే అయినా మహిళలు గదిలో నిద్రిస్తే పురుషులు ఆసుపత్రి ఆవరణలో పడుకునే వారు. అయితే ఆసుపత్రి సిబ్బంది కొన్ని వస్తువులు అందులో ఉంచి రెండు గదులకు తాళాలు వేశారు. దీంతో రోగుల అటెండర్స్ ఆరు బయట నిద్రపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొందరు ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీ స్థలాల్లో పడుకుంటున్నారు. అయితే ఆకతాయిలు మద్యం సేవించి వారిని ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
తాగునీటి కోసం అవస్థలు....
కాబోయే అమ్మలకు నేల పరీక్ష
అటెండర్స్ గదికి తాళాలు...
కుటుంబీకులే సిబ్బంది..


