● నేటి నుంచి కార్యక్రమం ప్రారంభం
శ్రీశైలం టెంపుల్: హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడేలలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పో తుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలిపారు. మంగళవా రం వారు విలేకరులతో మాట్లాడుతూ బుధవా రం శ్రీశైలంలోని మేకలబండ చెంచుగేడెంలో, 7న మార్కాపురం జిల్లా చింతలలో ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం శోభాయాత్ర, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం చేపడతామన్నారు. కార్యక్రమంలో పాల్గొనే చెంచు భక్తులందరికీ ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలను అందజేస్తామని పేర్కొన్నారు.
పాలిసెట్‌లో 89.73 ఉత్తీర్ణత
నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కళాశాలల ప్రవేశానికి ఈనెల 25వ తేదీన జరిగిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ తెలిపారు. జిల్లాలో 6,093 మంది బాల, బాలికలు పరీక్షలు రాయగా 5,467 మంది (89.73 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. యశ్వనిరెడ్డి 118 మార్కులతో 130వ ర్యాంకు, సాయి చేతన్116 మార్కులతో 286 ర్యాంకు, రవితేజస్ 115 మార్కులతో 288 ర్యాంకు సాధించారు.
ముక్తార్‌బాషాకు
డీఆర్‌ఓగా పదోన్నతి
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముక్తార్‌బాషాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజిలో గత నాలుగేళ్లుగా ఆయన సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతిపై కడప డివిజన్ సిద్దవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు.
పీఆర్ ఈఈ పోస్టుకు త్రిముఖ పోటీ
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ కర్నూలు ఈఈ పోస్టుకు ముగ్గురు డీఈఈలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేశ్వరరెడ్డి గత ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో పాణ్యం పీఆర్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి ఇన్‌చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతు లకు సంబంధించిన డీపీసీ పూర్తయిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో డీఈఈలుగా విధులు నిర్వహిస్తూ ఈఈలుగా పదోన్నతి పొందనున్న ముగ్గురు ఇక్కడకు ఈఈగా వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడపలో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డీఈఈ శివసాగర్‌రెడ్డి, జమ్మలమడుగు డీఈఈ రాఘవరెడ్డి, అనంతపురం జిల్లాలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీరాములు తమకున్న రాజకీ య, అధికార పరిచయాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఒక డీఈఈ మాత్రం జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టును ఎవరు దక్కించుకుంటారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది.
జనగణన పేరుతో
ఓటీపీలు అడిగితే నమ్మొద్దు
కర్నూలు: జన గణన పేరుతో ఓటీపీ అడిగితే అది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తుంచుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జన గణన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు అడగరని, అలాగే వేలిముద్రలు లేదా కంటి ఐరిష్ వంటి బయోమెట్రిక్ వివరాలు కూడా తీసుకోరన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సందేహాస్పద పరిస్థితులు ఉంటే వెంటనే డయల్ 112 లేదా 100కు కాల్ చేయాలన్నారు.
నంద్యాల(అర్బన్): పట్టణంలోని పలు రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు బాలాజీ కాంప్లెక్స్‌లోని 64, 131, 48 రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. 64వ రేషన్ షాపులో 8 ప్యాకెట్ల చక్కెర, 27 కేజీల గోధుమ పిండి అధికంగా ఉన్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. మిగిలిన రెండు షాపుల్లో సరుకులు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట సీఎస్‌డీటీ శేఖర్‌రెడ్డి, వీఆర్‌ఓలు ఉన్నారు. విజిలెన్స్ దాడుల సమాచారం అందుకున్న కొందరు డీలర్లు దుకాణాలు మూసివేశారు.


