నంద్యాల: జిల్లాలో ఆర్థిక వృద్ధి లకా్‌ష్య్‌లను సమర్థవంతంగా సాధించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా మానవ వనరుల కేంద్రంలో ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సుమారు రూ.20,395 కోట్ల ఆదాయం సాధించాలన్నారు. ఇందులో ఉద్యానవనం 37శాతం, పశుసంవర్ధక శాఖ 32శాతం, వ్యవసాయం 21శాతం, మత్స్యశాఖ 4శాతం, అటవీశాఖ 3 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. పారిశ్రామిక రంగంలో 2024–25లో రూ.7,894 కోట్ల ఆదాయం సాధించగా, 2025–26లో రూ.13,286 కోట్ల లక్ష్యం చేరుకోవాలన్నారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, గనులు, విద్యుత్ రంగాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల అభివృద్ధి సక్రమంగా లేకపోతే జిల్లా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. సేవా రంగానికి సంబంధించి 2024–25లో రూ.17,999 కోట్ల సాధనతో 11.77శాతం వృద్ధి నమోదు చేసినప్పటికీ, ఇతర రంగాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉందన్నారు. రాబోయే ఏడాదిలో కనీసం 15శాతం వృద్ధిని సాధిస్తూ రూ.20,800 కోట్ల లకా్‌ష్య్‌న్ని చేరుకోవాలన్నారు. కీలక శాఖల పనితీరు సూచికల నమోదు విషయంలో నిర్లక్ష్యం సహించబోమన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన గ్రేడింగ్‌లో బి–గ్రేడ్, సి–గ్రేడ్ వచ్చిన విభాగాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంట బీమా, ఉత్పాదకత, కౌలు రైతులకు రుణాలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు, పోలీసు శాఖలో కేసుల పరిష్కారం వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం


