అక్షర భాండాగారాలు
నిలువెల్లా నిర్లక్ష్యం..
ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆకట్టుకోలేక పోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించక పోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో గ్రంథాలయాలకు వెళ్తే అప్‌డేట్ పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వారికి అవసరమైన పుస్తకాలు కనిపించడం లేదు. దీంతో పాటు బ్యాంక్ పోస్టులకు సంబంధించిన మ్యాథ్స్, రీజనింగ్, అర్థమేటిక్ పుస్తకాలు కూడా అప్‌డేట్ చేసినవి లేవు.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
గ్రంథాలయాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. లైబ్రేరియన్ల కొరత కారణంగా కొన్ని లైబ్రేరియన్లకు ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. మరోవైపు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లైబ్రేరియన్లకు అదనపు పనిభారంతో పాటు ఆర్థిక భారం కూడా తోడవుతోంది. గ్రేడ్–1 లైబ్రేరియన్లు 1, గ్రేడ్–2 లైబ్రేరియన్లు 10, గ్రేడ్–3 లైబ్రేరియన్లు 15, జూనియర్ అసిస్టెంట్ 1, రికార్డు అసిస్టెంట్ 5, అటెండర్లు 34, విలేజ్ లైబ్రేరియన్లు 4, పార్ట్‌టైమ్ వర్కర్స్ 23, బైండర్ 1, అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్ 1, మొత్తం 94 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కర్నూలు కల్చరల్: కూటమి పాలనలో అక్షర జ్ఞానాన్ని పంచే గ్రంథాయాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. జిల్లాలోని గ్రంథాలయాల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఓ వైపు గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు విడుదల కాకపోవడం, మరో వైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 60 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కేంద్ర గ్రంథాలయం, ఒకటి గ్రామీణ గ్రంథాలయం, 58 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. 39 సొంత గ్రంథాలయాలు ఉండగా 8 గ్రంథాలయాలు రెంట్ ఫ్రీ, 13 గ్రంథాలయాలకు అద్దె చెల్లిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, కంటింజెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కర్నూలు నగర పాలక సంస్థ నుంచి రూ. 93 లక్షలు సెస్సు రావడంతో కంటి తుడుపుగా రెండు నెలల జీతాలు ఈ నెల రెండో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడటంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాల కొనుగోలు లేక నిర్వీర్యమవుతున్నాయి. పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగడనంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి సిబ్బంది కొరత తోడవడంతో గ్రంథాలయాలు మూత పడే స్థితిలోకి వెళ్లి పోయాయి.
పేరుకు పోయిన బకాయిలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ. 23 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించి రూ. 10.67 కోట్లు, కర్నూలు కార్పొరేషన్, మున్సిపాలిటీలు రూ. 7.32 కోట్లు, గ్రామ పంచాయితీలు రూ. 3.35 కోట్లు సెస్సు రావాల్సి ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం రూ. 13.03 కోట్లు, మున్సిపాలిటీలు రూ. 11.51 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ. 1.51 కోట్లు బకాయి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని కలెక్టర్లకు అధికారులు విన్నవిస్తూనే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కొనుగోలు, నిర్వహణ, పేపర్ బిల్లులు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగ పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.
గ్రంథాలయాలకు నిధులు ఇవ్వని
కూటమి సర్కారు
రెండు నెలలుగా జీతాలకు,
పెన్షన్లకు ఇక్కట్లు
పస్తులతో గ్రంథాలయాల ఉద్యోగులు
గుదిబండగా రూ.23 కోట్ల బకాయిలు


