జొన్నల కొనుగోళ్లలోనూ దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

జొన్నల కొనుగోళ్లలోనూ దౌర్జన్యం

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

● బలవంతంగా లారీలను తీసుకెళ్లిన అధికార పార్టీ నేత ● ఆగ్రహించిన రైతులు..కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత

● బలవంతంగా లారీలను తీసుకెళ్లిన అధికార పార్టీ నేత ● ఆగ్రహించిన రైతులు..కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత

బండిఆత్మకూరు: అధికారపార్టీ నాయకులు బరితెగించారు. అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు జొన్నల కొనుగోళ్లలోనూ తలదూర్చి అసలైన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మండలంలోని పరమటూరు గ్రామంలో వ్యవసాయశాఖ రెండురోజుల క్రితం మద్దతు ధరతో జొన్నల కొనుగోలును ప్రారంభించింది. అధికారులు రోజువారి కొనుగోలు షెడ్యూల్‌ను రైతులకు అందించారు. ఈ ప్రకారం మంగళవారం జొన్నల కొనుగోలు జరుగుతుండగా గ్రామానికి చెందిన అధికారపార్టీ నేత సాయిబాబా రెడ్డి దౌర్జన్యంగా అధికారుల నుంచి రెండు లారీలను తీసుకెళ్లి వాటిలో ఆ పార్టీ మద్దతుదారులు, షెడ్యూల్‌లో లేని రైతుల జొన్నలను లోడ్‌ చేయించారు. దీంతో సాఫీగా సాగాల్సిన జొన్నల కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహించారు. జొన్నల కొనుగోళ్లలో కూడా రాజకీయ జోక్యం సరికాదంటూ అధికారపార్టీ నాయకుడు లోడ్‌ చేసిన లారీకి అడ్డుపడి తమ నిరసన తెలిపారు. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న తహసీల్దార్‌ పద్మావతిని కలిసి రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం రైతుల నుంచి జొన్నలను కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement