● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: విద్యార్థుల కోసం మే 1 నుంచి 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని హాల్‌లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 8 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నంద్యాల స్పోర్ట్స్ కాంప్లెక్స్, రామకృష్ణ డిగ్రీ కళాశాల, టెక్కె మున్సిపల్ హైస్కూల్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, బాక్సింగ్, ఖోఖో, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి క్రీడలలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కోచింగ్ ఉంటుందన్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు చిక్కీ, స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అందిస్తారని, ప్రతి క్రీడాకారుడికి డైట్ ఛార్జీలుగా రోజుకు రూ.10 ఇస్తారని తెలిపారు. కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి కేంద్రానికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


