శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. సోమవారం వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దర్శనానికి రావడంతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. క్యూకంపార్ట్‌మెంట్లలో వేడిపాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర పరిధిలో పలుచోట్ల దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మంచినీటితో పాటు మజ్జిగను కూడా భక్తులకు ఉచితంగా అందించారు.
పశుగ్రాసం.. ప్రియం
దొర్నిపాడు: పశుగ్రాసానికి ఈ సారి భలే గిరాకి వచ్చింది. ఒక్కో వరి గడ్డి చుట్ట ధర రూ.60కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పొలాల్లోనే వరిగడ్డిని చుట్టలు చుట్టే యంత్రాలు రావడంతో రైతులు విక్రయించేందుకు సులువుగా మారింది. దీంతో పశుపోషకులు వాహనాల్లో లోడు చేసుకోవడానికి సులభంగా ఉందంటున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా వరిగడ్డికి డిమాండ్ పెరిగింది. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని భవిష్యత్‌లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ముందుగానే తెలుసుకుని పశుగ్రాసాన్ని వాములు వేసి నిల్వ చేసుకుంటున్నారు. గతలంలో గడ్డిని ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో తీసుకోని పోయేవారు. ప్రస్తుతం చుట్టలు కావడంతో లారీల్లో తరలిస్తున్నారు. అప్పట్లో ఎకరా గడ్డి రూ. 2 వేల నుంచి రూ.3వేల వరకు ఇండేదని, ప్రస్తుతం చుట్టలు చుట్టడం ద్వారా రూ. 5వేల వరకు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే రబీలో సాగు చేసిన వరిగడ్డికి తీపి ఎక్కువ ఉంటుందని దీన్ని పశువులు బాగా తినేందుకు ఆసక్తి చూపుతాయని రైతులు పేర్కొంటున్నారు.
రైల్వే మెజిస్ట్రేట్‌గా గిరిధర్‌బాబు బాధ్యతల స్వీకరణ
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ రైల్వే జడ్జిగా ఎస్.గిరిధర్‌బాబు సోమవారం నంద్యాల కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసు అధికారులు, పలువురు న్యాయవాదులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
అవినీతిపై విచారణ జరిపించాలి
బొమ్మలసత్రం: శ్రీశైలం ఏర్పాటు చేసిన వాల్మీకి అన్నదాన సత్రంలో అక్కడి నిర్వాహకులు చేస్తున్న అవినీతిపై విచారణ చేపట్టాలని గిడ్డయ్య అనే బాధితుడు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌కు విన్నవించుకున్నాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన జీపీఆర్‌ఎస్ కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుల్లో చట్టపరమైన సమస్యలను అక్కడికక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపామన్నారు. తక్కినవి ఆయా స్టేషన్ అధికారులకు పంపి తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని సూచించామన్నారు.
క్వింటా పత్తి రూ.9,615
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పత్తి ధర రూ.9,615గా నమోదైంది. సోమవారం రైతులు 758 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.9,615, మధ్య ధర రూ.9,300, కనిష్ట ధర రూ.5,525 పలికింది. అదేవిధంగా ఆముదాలు 32 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.6,056, మధ్య ధర రూ.6,038 పలికింది.


