నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, పీఎస్సీ, కెవీఎస్సీ డిగ్రీ కాలేజ్, ఎస్‌వైవీసీపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బస్టాండ్ సమీపంలోని గవర్నమెంట్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 4 కేంద్రాలను స్వయంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్‌కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సిటీ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,434 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 36 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించినట్లు వివరించారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 4వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పెళ్లిళ్ల వేళ.. బస్సులు కిటకిట
పాణ్యం: పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వివిధ గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు బస్సుల కోసం గంటల తరబడి ఎండలో ఎదురు చూడాల్సి వచ్చింది. వచ్చిన బస్సులన్నీ సామర్థ్యం మించి కిటకిటలాడుతూ వస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆదివవారం ఉదయం 8.30 గంటల నుంచి కర్నూలు వైపు వెళ్లే ప్రతి బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వచ్చాయి. నిలబడేందుకు కూడా వీలులేనంతగా బస్సులు ఫుల్‌గా వచ్చాయి. ఇక బనగానపల్లె వెళ్లే బస్సులు నంద్యాల నుంచి వెళ్లే క్రమంలో పాణ్యం బస్టాండ్‌లో ఆపకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు. కొన్ని బస్సులు ఆపినా కాలు కూడా పెట్టలేనంత ఫుల్‌గా వచ్చాయి. ఉదయం 9 గంటల తర్వాత దాదాపు అరగంటకు వరకు కర్నూలుకు వెళ్లే బస్సులు రాలేదు. బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు ఎండల తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. అధికారులు చొరవ తీసుకొని మరిన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
‘పెట్రో’ కష్టాలు
కోసిగి: పెట్రోల్ దొరకక వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ లేకపోవడంతో కోసిగిలో మూడు రోజులుగా హెచ్‌పీ, నయారా పెట్రోలియం బంకులు మూతపడ్డాయి. కేవలం ఇండియన్ పెట్రోలియం బంక్‌లో మాత్రమే పెట్రోల్‌ను పోస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలతో ప్రజలు బారులుదీరాల్సి వస్తోంది. వేసవికాలం కావడంతో ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. పెట్రోల్ బంక్ పరిసరాల్లో కనీస తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడుతున్నారు. అధికారులు స్పందించి కోసిగిలో ఉన్న మూడు పెట్రోలియం బంక్‌లలో పెట్రోల్, డీజిల్ సమస్యలు లేకుండా చూడాలని వాహనదారులు కోరారు.
ఎల్లెల్సీకి
నీటి సరఫరా బంద్
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఆదివారం రాత్రి 8 గంటలకు టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ ఏడాది డ్యాంలో కొత్త క్రస్టుగేట్ల ఏర్పాటుకు సంబంధించి ఎల్లెల్సీకి జనవరిలో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు తాగునీటి అవసరాల నిమిత్తం ఏప్రిల్ 3న విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు నీటిని వదిలిన అధికారులు ఆదివారం తిరిగి బంద్ చేశారు.


