శ్రీగిరిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో భక్తుల రద్దీ

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూకంపార్ట్‌మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు.

నేడు ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’

నంద్యాల(అర్బన్‌): విద్యుత్‌ శాఖ పరిధిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యుత్‌ శాఖాధికారి సుధాకర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 08514–222989 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యను వివరించాలన్నారు.

రేపు గిరిజనులకు డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ

ఆత్మకూరు: పట్టణంలోని ఆర్‌టీఓ కార్యాలయంలో ఈనెల 5వ తేదీన చెంచు గిరిజనులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లను జారీ చేయనున్నట్లు ఆర్టీఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకూరు, కొత్తపల్లె మండలాల్లో వాహనాలు డ్రైవింగ్‌ చేసే చెంచు గిరిజనలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పంపిణీ చేస్తామన్నారు. చెంచు గూడేలకు చెందిన అర్హులైన గిరిజనులందరూ డ్రైవింగ్‌ లైసెన్సు పొందేందుకు హాజరుకావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement