● బస్టాండ్‌లో వసతులపై కలెక్టర్ ఆగ్రహం
నంద్యాల (వ్యవసాయం): స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను గుర్తించిన కలెక్టర్ రాజకుమారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్‌ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌లో నెలకొన్న అపరిశుభ్రత వాతావరణం, టాయిలెట్ల నిర్వహణలో నిర్లక్ష్యం, ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం తదితర సమస్యలను గుర్తించిన కలెక్టర్ డిపో మేనేజర్‌పై మండిపడ్డారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. శుభ్రత, సౌకర్యాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని, వారం రోజుల్లో మార్పులు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. తనిఖీ సందర్భంగా బస్ స్టేషన్ పరిధిలోని ప్రతి దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి విధుల సమాచారం తెలుసుకున్నారు. అలాగే ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో మహిళా కండక్టర్లను కలెక్టర్ అభినందిస్తూ, వారి సేవలను ప్రశంసించారు. రవాణా రంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.


