నంద్యాల(న్యూటౌన్): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా 20 రోజుల పాటు ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం, రెమిడియల్ తరగతుల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతిలో ఫెయిలైన 3,743 మంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారిలో విద్యా లోపాలను గుర్తించి ఉత్తమ విద్యాబోధన అందించాలని డీఈఓ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. కనీసం 20 మంది విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహించాలని సూచించారు.


