బొమ్మలసత్రం: రహదారులపై ఒకే ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌ల వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ శనివారం ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పలు రహదారుల్లో బ్లాక్‌స్పాట్‌లను గుర్తించినట్లు తెలిపారు. 44వ జాతీయ రహదారిపై 9, నంద్యాల పట్టణ కేంద్రంలో 6 బ్లాక్‌స్పాట్లు గుర్తించామన్నారు. మలుపుల్లో ఉన్న బ్లాక్‌స్పాట్‌ల వద్ద రహదారులను విస్తరించడమే కాకుండా ప్రమాదాల నివారణకు సూచికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
స్వచ్ఛ రథాల్లో
పొడి చెత్త సేకరణ
● జిల్లా పరిషత్ సీఈఓ రమణా రెడ్డి
వెలుగోడు: గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల ద్వారా పొడి చెత్త సేకరణ చేపట్టాలని జిల్లా పరిషత్ సీఈఓ రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. వేల్పనూరులోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్వచ్ఛ రథం ద్వారా రోజుకు కనీసం 200 కిలోల పొడి చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. అనంతరం వెలుగోడు మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. స్వర్ణ గ్రామం కార్యాలయాల సిబ్బందితో నిర్వహించే అన్ని సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలక్టోరల్ వార్డు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, జలధార – జలహారతి పనులను గ్రౌండ్ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు అవగాహన పెంచి ప్రభుత్వ పథకాలపై సంతృప్తి స్థాయిని మెరుగుపరచాలని సూచించారు. అలాగే జనగణన పనులను సిబ్బంది అందరూ వెంటనే ప్రారంభించి సమయానికి పూర్తి చేయాలని సీఈఓ రమణా రెడ్డి స్పష్టం చేశారు.
గిరిజన గురుకుల కాలేజీల్లో ప్రవేశానికి ఆహ్వానం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని సున్నిపెంట గిరిజన గురుకుల బాలుర కళాశాల, మహానంది (నెరవాడ) గిరిజన గురుకుల బాలికల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు, నంద్యాల జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా టీడబ్ల్యూఆర్‌ఈఈఎస్‌సీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కౌన్సిలింగ్ 26వ తేదీన నిర్వహిస్తామన్నారు. వివరాలకు నెరవాడ కళాశాల (9490957266, 9963587831), సున్నిపెంట కళాశాల (9490957268, 9441114001)లో సంప్రదించాలని వివరించారు.
అవకాశాలనుసద్వినియోగం చేసుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నంద్యాల డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్‌ను విజయవంతంగా ముగించుకుని శనివారం జిల్లా చేరుకున్న విద్యార్థులకు నంద్యాల రైల్వే స్టేషన్‌లో డీఈఓ జనార్దన్ రెడ్డి, సమగ్రశిక్ష సెక్టోరల్ అధికారులు జగన్‌మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అవకాశం కల్పించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని చేనేత, పవర్– లూమ్ యూనిట్లు కలిగిన కుటుంబాలకు ఏప్రిల్ 1వ తేది నుంచి (చేనేత మగ్గం కలిగిన కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్లు) ఉచిత విద్యుత్ అందించను న్నట్లు జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జి.నాగరాజరావు తెలిపారు. జిల్లాలో 2,380 చేనేత కుటుంబాలను గుర్తించినట్లు శనివా రం తెలిపారు. అలాగే మూడు పవర్ లూమ్ యూనిట్లను(కర్నూలు 02, ఎమ్మిగనూరు 01) గుర్తించి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్ అమలుకు చర్యలు చేపట్టామన్నారు.


