డోన్ రూరల్: ధనార్జనే ధేయ్యంగా అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలకు కాసులకు కక్కుర్తితో కొందరు అధికారులు వంత పాడుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌లు, వెలుగు, మెప్మాలో ఆర్‌పీలు, రేషన్ షాపు డీలర్లపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకు తాజా సంఘటన డోన్ మండలం వలసల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. జిల్లా డీలర్ల సంఘం వర్కింగ్ సంఘం అధ్యక్షులు, స్థానిక డీలర్ షాప్ యజమాని బోయ సుదర్శన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడని కక్ష గట్టి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారులతో ప్రతి నెల రెండు, మూడు సార్లు ఆకస్మిక తనిఖీల పేరుతో వేధించడమే పనిగా పెట్టుకున్నారు. పలువురు పోలీస్ అధికారులతో పార్టీ మారమని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. వారి పాచికలు పారకపోవడంతో సుదర్శన్ రెడ్డిని సస్పెండ్ చేసేందుకు కుట్ర పన్నారు. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి రేషన్ బియ్యాన్ని తిరిగి దుకాణానికి తెచ్చి కాటా వేసి రెండు మూడు కేజీల చొప్పున తక్కువ ఉన్నాయని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించారు. తమ దృష్టికి వచ్చిందంటూ అధికారులు తనిఖీ చేసి 75 కేజీల బియ్యం, 1.5 కేజీల చెక్కర తక్కువ ఉందని తేల్చి సస్పెండ్ చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ అధికారులపై ఒత్తిడితోనే తనపై వేటు పడిందని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ అధికారి రబ్బానీ అవినీతి వల్ల ప్రతి ఒక్క డీలర్ నష్టపోతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతి డీలర్లను
వేధిస్తున్న టీడీపీ నేతలు
రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
అండతో బెదిరింపులు
రాజకీయ కక్షతో
వలసల గ్రామ డీలర్ సస్పెన్షన్


