శాస్త్రోక్తంగా చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా చక్రస్నానం

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

ఆళ్లగడ్డ: నరసింహస్వామి జయంతి బ్రహ్మత్సోవాల ముగింపు సందర్భంగా గురువారం ఎగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు తీర్థవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాలానరసింహస్వాములను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భవనాశి గుండం వరకు తోడ్కొని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శనమూర్తికి, నిత్య అభిషేక ఉత్సవమూర్తికి కోనేరులో శాస్త్రోక్తంగా తీర్థవారి చక్రస్నానం చేయించారు. ఉత్సవమూర్తులతో పాటు అర్చకులు, పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు తీర్థవారి చక్ర స్నానాలు అచరించారు. అనంతరం ప్రాయశ్చిత్య హోమం నిర్వహించారు.

స్వాతి మహోత్సవం.. ప్రహ్లాదవరదుని వైభవం

స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణ చేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement