నందికొట్కూరు: ముస్లింలపై తెలుగుదేశం పార్టీ వివక్ష చూపుతోందని, నందికొట్కూరులో ప్రారంభం కాని షాదీఖానా ఇందుకు నిదర్శమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దార సుధీర్ అన్నారు. పట్టణంలోని ఆత్మకూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన షాదీఖానాను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో 1998, 2014లో షాదీఖానా నిర్మాణం కోసం రెండు శిలాఫలకాలు వేశారన్నారు. నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వస్తే కమీషన్లు ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 2019లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహకారంతో షాదీఖానా నిర్మాణానికి రూ.1.50 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. షాదీఖానా నిర్మాణం పూర్తయి, ప్రారంభం చేసేలోగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందన్నారు. రెండేళ్లుగా ఎంపీ, ఎమ్మెల్యే గ్రూపులు కమిటీల పేరుతో ప్రారంభించకుండా ముస్లింలపై వివక్ష చూపుతున్నారన్నారు. వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. షాదీఖానాను పరిశీలించిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్, రాష్ట్ర నాయకులు యాట ఓబులేసు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వా శివరామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ తులసిరెడ్డి, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మార్కెట్ రాజు, మాజీ కౌన్సిలర్ షేక్ నాయబ్, స్థానిక నాయకులు బ్రహ్మానందరెడ్డి, ఓంకారేశ్వరరెడ్డి ఉన్నారు.
షాదీఖానా ప్రారంభంలో
రాజకీయాలు చేయొద్దు
రూ.1.50 కోట్లతో నిర్మాణం పూర్తి
చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదే
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త
డాక్టర్ దార సుధీర్


