
శ్రీగిరి కిటకిట
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌లో మల్లన్న స్పర్శ దర్శనం టికెట్లు పొందినభక్తులు మూడు విడుతలుగా దర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. మరో వైపు శ్రీశైలం డ్యామ్ గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండంతో తిలకించేందుకు పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.