ప్రత్యేక వైద్య శిబిరాలనుసద్వినియోగం చేసుకోండి
నంద్యాల(న్యూటౌన్): దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రవికృష్ణ, అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి రామలింగం సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన నంద్యాల పురపాలక టౌన్‌హాల్‌లో, జూన్ 28న నందికొట్కూరు, జూలై 1న ఆళ్లగడ్డ, 4న ఆత్మకూరు, 8న బనగానపల్లె, 11న డోన్, 15న పాణ్యంలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సహాయ పరికరాల ఉచిత పథకం, భారత కృత్రిమ అవయవాల తయారీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులను పరీక్షించి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, అంధుల చేతి కర్రలు ఉచితంగా అందించడానికి ఎంపిక చేస్తారన్నారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన అవసరం
గడివేముల: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన అవసరమని నంద్యాల జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్‌బాబు అన్నారు. శనివారం స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డాక్టర్లు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది వర్షాకాలం కావున అతిసార కేసులు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని, ప్రజల కు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం పెసరవాయిలో జరుగుతున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పోస్టర్లను విడుదల చేశారు. ఆయన వెంట డాక్టర్ కిరణ్‌కుమార్, ఎంపీహెచ్‌ఈఓలు జగదీశ్వరప్ప, మహేశ్వరరెడ్డి, సూపర్‌వైజర్ మనోహర్, ఎంఎల్‌హెచ్‌పీ అలీబాషా, ఎఎన్‌ఎం దేవకుమారి, ఆశాలు పాల్గొన్నారు.
ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
పాములపాడు: మూడేళ్ల పిల్లలను చేర్చుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్స్ ఎంఈఓ 2 సుభాషిణీ దేవికి ఫిర్యాదు చేశారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ భవనంలో అంగన్‌వాడీ టీచర్లు నాగమణి, నాగమ్మ, శివలక్ష్మి, చెన్నమ్మ, నాగమద్దమ్మలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల వయస్సు నిండని పిల్లలను నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటూ చేర్చుకోవడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారనానరు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రత్యేక వైద్య శిబిరాలనుసద్వినియోగం చేసుకోండి


