
బాబుది వెన్నుపోటు చరిత్ర
ఆళ్లగడ్డ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చరిత్ర అంతా మోసం, దగా, వెన్నుపోట్లు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం.. నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో కల్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను చూస్తుంటే భయమేస్తోందంటూ బీద ఏడుపులు ఏడవటం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఆర్థిక వ్యవస్థ సరిపోదని, సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలను ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి మంగళవారం తెచ్చే అప్పులు ఎవరికి పంచుతున్నారన్నారని ప్రశ్నించారు. రెడ్‌బుక్‌ను చూసి ఎవరూ భయపడే పడే పరిస్థితిలో లేరని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నాగేశ్వర్‌రావు, నరసింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.