
వినిపిస్తుందో లేదో మిషన్ నిర్ధారిస్తుంది
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో చెవుడు...మూగ సమస్యతో బాధపడుతుంటారు కొందరు. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడియోమెట్రి పరీక్షలు నిర్వహించి వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. ఇప్పటివరకు ఈ యంత్రాన్ని అమరిస్తే వినిపిస్తుందా లేదా అని రోగి సంజ్ఞలు చేస్తే దానిని బట్టి నివేదికలు ఇచ్చేవారు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు ఎలాంటి సమస్య లేకపోయినా ఉన్నట్లు నటించి వికలాంగ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. ఇలాంటి వాటిని చెక్పెట్టేందుకు ఇప్పుడు బేరా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టీ విభాగం ఓపీ వద్ద ఏర్పాటు చేసిన బేరా పరీక్ష కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ హెచ్వోడి డాక్టర్ వీరకుమార్ మాట్లాడుతూ బేరా పరీక్ష ద్వారా రోగికి వినిపిస్తుందా లేదా అన్నది మిషనే నిర్ధారిస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో పాటు వినికిడి లోపం, శ్రవణ నాడీ రుగ్మతలు, వినికిడిని ప్రభావితం చేసే నాడీ సంబంధిత పరిస్థితులను నిర్ధారించడంలో ఈ బేరా టెస్ట్ మిషన్ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివబాలనాగాంజన్, ఈఎన్టి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ చిన్న లింగన్న, డాక్టర్ మమతాదేవి తదితరులు పాల్గొన్నారు.