
మన్యం వీరుడి పోరాటం స్ఫూర్తిదాయకం
నంద్యాల(న్యూటౌన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అల్లూరి చిత్రపటానికి అధికారులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ రామునాయక్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి పాత్ర ఎనలేనిదన్నారు. బ్రిటీషుయులను ఎదురించి మన్యం గిరిజనులను కాపాడిన వీరుడన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రవికుమార్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
మెగా డీఎస్సీలో
క్రాష్‌కోర్సు శిక్షణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉచిత మెగా డీఎస్సీ క్రాష్ కోర్సులో శిక్షణను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధులు, బధిరులు, శారీరక విభిన్న ప్రతిభావంతులైన ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఈ శిక్షణను ఏర్పాటు చేశారన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా mdfc.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కనీసం 40 శాతం వికలత్వం ఉన్న వారు మాత్రమే అర్హులని, శిక్షణ కోసం టెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.