
ఆదర్శనీయులు దామోదరం సంజీవయ్య
● సంజీవయ్య వర్ధంతి సభలో వక్తలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య కుల, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు విశేషమైన సేవలు అందించి అందరికి ఆదర్శంగా నిలిచారని మాల గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కొనియాడారు. సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహం సమీపంలోనే సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్, శరత్‌బాబు, చైర్మన్ సోమన్న, కన్వీనర్ చంద్రశేఖర్, కోశాధికారి రాజశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు హెచ్‌డీ ఈరన్న, ఎస్సీ, ఎస్టీ, లాయర్స్ ఫోరం అధ్యక్షుడు ఎగ్గోని జయరాజ్, దామోదరం రాధాక్రిష్ణ హాజరయ్యారు. ముందుగా సభకు అధ్యక్షతన వహించిన గోన నాగరాజు మాట్లాడుతూ రాయలసీమలోని బోయ కులాన్ని ఎస్‌టీ జాబితాలో చేర్చారని, కోస్తా ప్రాంత కాపు ( తెలగ ), రాయలసీమ బలిజలను బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని, ఎస్టీ, ఎస్టీలకు ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలయ్యేలా 1961లోనే ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలు అందించారన్నారు. భూమి లేని నిరుపేదల కోసం 6 లక్షల ఎకరాలను పంచారన్నారు. వ్యవసాయానికి కూడా పెద్ద పీట వేసి రాయలసీమలోని కర్నూలు జిల్లాలో హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వరదరాజ స్వామి ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. మరో సభ్యులు శరత్‌బాబు మాట్లాడుతూ మాల గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు బ్యాంకుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి రాజశేఖర్, నాయకులు డా.వై ప్రవీణ్‌కుమార్, ఇరిగేషన్ డీఈఈ ఎన్ ప్రసాదరావు, రిటైర్డు అడిషనల్ ఎస్‌పీ వేల్పుల జయచంద్ర, మాధవస్వామి, డీఆర్ రాజు, సోగరాజు మునెయ్య, రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.