
డీఎస్సీ ప్రిపరేషన్ గడువు పెంచాలి
కర్నూలు సిటీ: డీఎస్సీకి ప్రిపరేషన్ గడువు పెంచాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ సరిగా లేదని అందులోని పలు అంశాల్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం బిర్లా కాంపౌండ్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నామని, అయితే అందులో అనేక అంశాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు జరపరాదని, ఒక జిల్లా ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో పాటు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ మార్కులు 40 శాతానికి తగ్గించాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్లపై సర్కారు స్పందించకపోతే డీఎస్సీ అభ్యర్థులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమ చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి ఉదయ్, కర్నూలు మండల కార్యదర్శి ప్రకాష్, హరికిషన్ రెడ్డి, విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.
సర్కారు తీరుకు నిరసనగా
రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులు