
అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
కర్నూలు(సెంట్రల్): ఉల్లాస్ పథకంతో నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లాను అగ్రగామిగా నిలపాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ అధికారులకు సూచించారు. వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమంపై బుధవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని డీఆర్వో తన చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతేడాది ఉల్లాస్ కార్యక్రమంలో మొదటి విభాగంలో 28,872 మందికి గాను 27,200 మందికి ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసి అసెస్‌మెంట్ టెస్టుకు హాజరవ్వగా.. అందులో 25,257 మంది పాసైనట్లు తెలిపారు. అదేవిధంగా 2025–26 విద్యాసంవత్సరంలో 30,005 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు చెప్పారు. ఉల్లాస్ కార్యక్రమం కింద ఏప్రిల్ 16 నుంచి 24వ తేదీ వరకు 9 రోజులపాటు సర్వే మొదలు పెట్టి నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. అనంతరం వారికి మే 5 నుంచి సెప్టెంబర్18వ తేదీ వరకు టీచర్లతో తరగతులు నిర్వహించి సెప్టెంబర్ 21 ఎఫ్‌ఎల్‌ఎస్‌ఏ టెస్టును నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వయోజన విద్య శాఖ డీడీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం పొదుపు గ్రూపు మహిళలు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, వాచ్‌మెన్‌లు, సహాయకులు, అంగన్‌వాడీ సహాయకులు, ఉపాధి కూలీల్లో నిర్లక్ష్యరాసులను గుర్తించి చదువు నేర్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ శామ్యూల్‌పాల్, డీఆర్‌డీఏ ఏపీడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నందవరం: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ ఎం.కేశవ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలింపుపై బుధవారం పోలీసులు దాడులు చేపట్టారు. నాగలదిన్నె గ్రామంలోని తుంగభద్ర నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు, నదికై రవాడి గ్రామానికి చెందిన ట్రాక్టర్, ఎమ్మిగనూరు టౌన్‌కి చెందిన రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నాగలదిన్నెలో ఇసుక రీచ్ లేదని, అక్రమంగా తరలిస్తే ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లపై కేసు నమోదు హెచ్చరించారు.