కోవెలకుంట్ల: పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ సినిమా థియేటర్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న గుద్దేటి హరిణి ఆత్మహత్యకు కారకులైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్‌ఐ అందించిన సమాచారం మేరకు.. కోవెలకుంట్లకు చెందిన షేక్ సాధిక్ ఉసేన్ అనే యువకుడు 2021లో హరిణిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితం నాలుగేళ్ల పాటు సజావుగా సాగింది. ఇటీవల సాధిక్ ఉసేన్ ఇదే పట్టణానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నాలుగు రోజుల క్రితం భర్త, అత్త, మామలు, అవ్వపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి హరిణి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి సోదరుడు శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు హరిణి ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త సాధిక్ ఉసేన్, అత్తమామలు మహబూబ్‌బీ, జాఫర్ ఉసేన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫోర్జరీపై కేసు నమోదు
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని పెట్నికోటలో పొలం పత్రాలు ఫోర్జరీ చేసి ఇతరుల పేరుపై రి జిస్ట్రేషన్ చేయించడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన పెద్దుగాళ్ల సుబ్బమ్మ పేరుతో ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని పొలతల సుబ్బమ్మ పేరుతో ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. పెద్దుగాళ్ల రామేశ్వరయ్య ఫిర్యాదు మేరకు నాగేంద్రరెడ్డి, వెంకట్రామిరెడ్డితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.