ఇల కై లాసమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజ వాహనంపై విహరించారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులు చేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అర్చన, హారతి పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. గజవాహనంపై దర్శనమిచ్చిన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పూజల్లో కలెక్టర్ రాజకుమారి, జేసీ విష్ణు చరణ్, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.