
గణేశ సదన్ వివరాలు తెలుసుకుంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న దర్శనార్థం తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో అనువైన చోట్ల దశలవారీగా మరికొన్ని వసతి సముదాయాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైలం చేరుకున్న మంత్రి దేవస్థానం ఆధ్వర్యంలో 220 గదుల సముదాయంతో నిర్మించిన గణేశ సదన్‌ను పరిశీలించారు. గణేశ సదనంలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లు, కార్యాలయ ప్రవేశం, రెస్టారెంట్, ప్రధాన బ్లాక్‌లోని గదులను మంత్రి పరిశీలించారు. గణేశ సదన్ నిర్మాణపు వివరాలను మంత్రికి ఈఓ ఎస్.లవన్న వివరించారు. గణేశ సదన్ ప్రాంగణానికి ఎడమవైపు ఆరుబయలు ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశాన్ని వీలైనంత మేరకు విస్తరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులు వసతి గదులు పొందేటప్పుడు వేచి ఉండేందుకు వీలుగా తగు సౌకర్యవంతమైన ఏర్పాటు చేయాలని సూచించారు. గణేశ సదన్ ప్రాంగణంలో ఆలయ వేళలు, ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవల వివరాలు, దేవస్థానంలో నిర్వహిస్తున్న విరాళాల పథకాలు మొదలైన సమాచారాన్ని కూడా భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ దాతల సహకారంతో భక్తులకు మరిన్ని వసతి గదులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భక్తులు విరివిగా విరాళాలు చెల్లించేందుకు వీలుగా నిర్మాణ ప్రతిపాదనలను గురించి తగు ప్రచారాన్ని కల్పించాలన్నారు. మంత్రి వెంట దేవస్థాన ఈఈ వి.రామకృష్ణ, ఎం.నరశింహారెడ్డి, భాస్కర్, డీఈ పి.చంద్రశేఖరశాస్త్రి, ఏఈ భువన్‌కుమార్, ఎం.ప్రణయ్ తదితరులు ఉన్నారు.
దశల వారీగా నిర్మాణానికి చర్యలు
మంత్రి కొట్టు సత్యనారాయణ