తిరుమల వెళ్లే ప్రయాణికులకు ఊరట
● సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలుకు అదనంగా నాలుగు బోగీలు
మిర్యాలగూడ అర్బన్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్–తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్ కార్‌లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడుస్తుండగా.. అదనంగా 4 ఏసీ చైర్ కార్‌లతో కూడి బోగీలను శాశ్వత ప్రాతిపదికన జతచేయాలని నిర్ణయించారు. దీంతో 20 బోగీలతో పరుగులు పెట్టనున్న వందే భారత్ రైలులో మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం నుంచి బోగీలను జత చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలపడంతో నల్లగొండ, మిర్యాలగూడ నుంచి నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు ఎంపిక
నేరేడుచర్ల : జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు నేరేడుచర్లకు చెందిన మచ్చ పరమేశ్ ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్‌లోని పఠాన్‌చెరు మైత్రి గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న పరమేశ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి సూర్యాపేట జిల్లా జట్టును రెండో స్థానంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో అధికారులు అతడిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. డిసెంబర్ 5 నుంచి 7వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పరమేశ్ పాల్గొన్ననున్నట్లు లాక్రోస్ రాష్ట్ర కోచ్ భానుచందర్ తెలిపారు. జాతీయస్థాయి పోలీలకు ఎంపికై న పరమేశ్‌ను తల్లిదండ్రులు స్వరాజ్యం, రాంబాబుతో పాటు తోటి క్రీడాకారులు, పట్టణ వాసులు అభినందించారు.
భార్యతో గొడవపడి
యువకుడి బలవన్మరణం
హుజూర్‌నగర్ : బట్టలు కొనే విషయంలో భార్యతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన పిల్లుట్ల నవీన్ (22), మేళ్లచెరువుకు చెందిన పి. త్రిషను ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరు నవీన్ ఇంటి దగ్గర రెండునెలల పాటు ఉన్నారు. నాలుగు నెలల క్రితం వారు హుజూర్‌నగర్ పట్టణంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఇటీవల నవీన్ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. మంగళవారం బట్టలు కొనేందుకు దుకాణానికి వెళ్లారు. బట్టలు కొనే క్రమంలో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఇంతలో నవీన్ బైక్‌పై ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత త్రిష ఇంటికి వెళ్లేసరికి నవీన్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో త్రిష కత్తితో గొంతు కోసుకునే ప్రయత్నం చేసింది. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి నవీన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. త్రిషకు ప్రథమ చికిత్స చేసి కుట్లు వేశారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపారు.
తిరుమల వెళ్లే ప్రయాణికులకు ఊరట


