నాకు అన్యాయం చేశారు
సీఎంను నమ్ముకున్నోళ్లకే పదవులు
నల్లగొండ : కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పని చేసినా పదవులు ఇచ్చే సమయంలో నాకు అన్యాయం చేశారని ఆ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి అన్నారు. 22 ఏళ్లుగా పార్టీలో ఉంటూ.. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిగా పని చేస్తున్నానని డీసీసీ అధ్యక్ష పదవికి నా సామాజిక వర్గమే నాకు అడ్డయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశానని.. ఎస్సీనో, బీసీనో అయితే నాకు పదవి వచ్చేదన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో 70 శాతానికి పైగా కార్యకర్తలు తనకు ఇవ్వాలని చెప్పారని.. కానీ అవకాశం రాలేదన్నారు. అభిప్రాయ సేకరణ కాకుండా నేరుగా డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే బాగుండేదన్నారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. కొత్తగా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పున్న కైలాష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి నష్టం చేయాలనుకునే వారికి వెంటపెట్టుకుని తిప్పితే చూస్తూ ఊరుకోమన్నారు.
కార్యకర్తను కాపాడుకున్నా..
ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశానని.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నమ్మకం ఉండేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడితే తాను వారికి అండగా ఉండి కాపాడుకున్నానని చెప్పారు. ఆ సమయంలో నల్లగొండ మున్సిపాలిటీలో బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి 20 కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ తరఫున గెలుచుకున్నమన్నారు. డీసీసీ అధ్యక్ష పదవిపై తనకు విజన్ ఉందని.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనేది తన ఆలోచన అన్నారు.
24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ ఇప్పించవచ్చు..
మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు ,నాయకులు అనుకుంటే తనకు 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇప్పించవచ్చన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా అడ్డం వచ్చిన తన సామాజిక వర్గం.. కార్పొరేషన్ పదవికి అడ్డుకాదన్నారు. జిల్లా నాయకులంతా కలిసి తనకు కార్పొరేషన్ పదవి వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించా
ఫ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించాలి
ఫ కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాకు వస్తే తాను కార్యకర్తలను తీసుకుని పాదయాత్రలో వెంట నడిచానన్నారు. ‘అప్పుడు నా భుజాన చేయి వేసిన రేవంత్‌రెడ్డి నేడు నా గొంతు కోస్తాడని అనుకోలేదని’ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని నమ్ముకున్నోళ్లకే పదవులు వస్తున్నాయని, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్ ఎంపీలు అయ్యారని తెలిపారు. తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో కార్యకర్తలు తీసుకుని పాల్గొన్నానని చెప్పారు. ‘మా నాన్న ఎంపీ, ఎమ్మెల్యే అయి ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అయ్యే వాడిని.. మా నాన్న పార్టీలో కార్యకర్తగా పని చేశాడు’ అని మోహన్‌రెడ్డి చెప్పారు. పదవుల కోసం కాళ్లు మొక్కడం, బ్లాక్‌మెయిల్ చేయడం తనకు అలవాటు లేదన్నారు.


