
గ్రామాల్లోనే విత్తనోత్పత్తి!
ఫ జిల్లాలోని 564 రెవెన్యూ గ్రామాల్లో
1,692 మంది రైతుల ఎంపిక
ఫ వారికి వరి, పెసర విత్తనాలు అందజేత
ఫ దిగుబడి వచ్చాక ఇతర రైతులకు పంపిణీ చేసేలా ప్రణాళిక
నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి
రైతులు స్వతహాగా విత్తనాలను పండించుకోవడంతో ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నకిలీ విత్తనాల బెడద ఉండదు. నాణ్యమైన విత్తనాలు స్వగ్రామంలోనే లభించటంతో రైతులకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ ధర, నాణ్యమైన విత్తనం రైతుకు అందుతుంది. భవిష్యత్‌లో గ్రామాలే విత్తన కేంద్రాలుగా మారుతాయి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
పెద్దవూర: రైతులు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా అవసరమైన విత్తనాలను స్వతహాగా తయారు చేసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. పూర్వం రైతులు మేలైన దిగుబడిని సేకరించి భద్రపర్చుకుని వాటిని మరుసటి ఏడాదికి విత్తనాలుగా ఉపయోగించేవారు. మళ్లీ ఈ పద్ధతిని ప్రోత్సహించే దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, అనుబంధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ప్రణాళికలు రూపొందించాయి. వరి, పెసర విత్తనోత్పత్తి చేసేందుకు గాను రెవెన్యూ గ్రామాల వారీగా రైతులను ఎంపిక చేశాయి. వారికి కావాల్సిన విత్తన సీడ్‌ను ఆయా క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల్లో 95శాతం సబ్సిడీపై అందించారు.
జిల్లాలో 564 గ్రామాల్లో 1,692 మందికి..
జిల్లా వ్యాప్తంగా 564 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున 1,692 మంది రైతులను విత్తనోత్పత్తి కోసం ఎంపిక చేశారు. వీరిలో వరి విత్తనోత్పత్తికి ఇద్దరిని (1,128 మంది), పెసరకు ఒకరి చొప్పున ఎంపిక చేశారు. రైతు వేదికల్లో నిర్వహించిన ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా ఆయా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలతో 1,128 ఎకరాల్లో వరి, 564 ఎకరాల్లో పెసర సాగు కానుంది. వరిలో డబ్ల్యూజీఎల్ 44, డబ్ల్యూజీఎల్ 1246, డబ్ల్యూజీఎల్ 1355, పెసర ఎంజీజీ 385 రకాలను ఎంపికై న రైతులకు 95శాతం సబ్సిడీపై కేవలం రూ.50కే అందజేశారు. ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు పంట ఉత్పత్తిని గ్రామంలోని తోటి రైతులకు అందజేయాల్సి ఉంటుంది.
నిరంతరం శాస్త్రవేత్తల పర్యవేక్షణ
వరి, పెసర విత్తనాలను ఇవ్వడమే కాకుండా వరి నారు సిద్ధం కాగానే వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది. నాటు ఎలా వేయాలి, ఎంతమేర మందులు వాడాలి, నీరు ఏ మోతాదులో అందించాలి, కలుపు తీసే విధానం, సస్యరక్షణ చర్యలపై ఎప్పటిప్పుడు రైతులకు సూచనలు, సలహాలు అందజేసి పంట పూర్తయ్యే వరకు పర్యవేక్షించనుంది. చివరగా పంట కోత దశలో క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయిలో రైతు నుంచి మరో రైతుకు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటారు.
కల్తీ విత్తనాలకు చెక్
కల్తీ విత్తనాలతో ఏటా ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులే స్వతహాగా విత్తనాలను పండించడంతో తిప్పలు తప్పనున్నాయి. ఈ విత్తనోత్పత్తి అంతకంతకు పెరిగితే కల్తీ విత్తనాలు విక్రయించే మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చు.

గ్రామాల్లోనే విత్తనోత్పత్తి!