
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
దేవరకొండ : ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విలఫమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ నిలదీస్తాడోనని కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే అడుగడుగునా పోలీసు ఆంక్షలు, నిర్భందాలు విధించిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గాజుల ఆంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, నీల రవి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.