
ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన జ్యోతిలక్ష్మి తలపై ఆటో ఎగిరి పడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
నల్గొండ: హైవేపై కేతేపల్లిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కేతేపల్లికి చెందిన పిల్లలమర్రి జ్యోతిలక్ష్మి(43) స్థానికంగా ఇండేన్ వంట గ్యాస్ సిలిండర్‌ల డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం జ్యోతిలక్ష్మి తన స్కూటీపై ఇంటి నుంచి గోదాం వద్దకు బయలుదేరింది.
మార్గమధ్యలో డీపాల్ పాఠశాల సమీపంలోని జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా నకిరేకల్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది. అనంతరం అటో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన జ్యోతిలక్ష్మి తలపై ఆటో ఎగిరి పడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆటో డ్రైవర్ దాస్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలు జ్యోతిలక్ష్మికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె భర్త ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గాయపడిన దాస్‌ను చికిత్స నిమిత్తం మొదట నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పోస్టుమార్టం నిమిత్తం జ్యోతిలక్ష్మి మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. నకిరేకల్ ఆస్పత్రిలో జ్యోతిలక్ష్మి మృతదేహాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వేర్వేరుగా సందర్శించి నివాళులు అర్పించారు.