కొల్లాపూర్: అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. సోమవారం ఆయన కొల్లాపూర్‌లోని 4, 9 వార్డుల్లో పర్యటించి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పెండింగ్‌లో ఉన్న పనుల గురించి మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్‌చైర్మన్ షేక్ రహీంపాషతో చర్చించారు. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అవసరమైన స్థలాల కోసం సోమశిలకు వెళ్లే దారిలోని భూములను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను భూ సేకరణ ద్వారా సేకరించాలని ఆర్డీఓ భన్సీలాల్‌ను ఆదేశించారు. భూసేకరణలో జాప్యం చేయవద్దన్నారు. ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు ద్వారా కొల్లాపూర్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ యాదగిరి, రెవెన్యూ అధికారులు తదితరులున్నారు.


