కందనూలు: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు డ్రగ్స్ బారినపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని.. సమాజంపై గౌరవంతో మెలిగే విధంగా పిల్లలను పెంచాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 1908కు సమాచారం అందించాలని ఆయన కోరారు. డీఎస్పీలు బుచ్చయ్య, శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్ పాల్గొన్నారు.
32 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 32 మందికి నయాబ్ తహశీల్దార్లుగా(డీటీ) పదోన్నతి పొందారు. ఈ మేరకు బుధవారం సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీటీలుగా పదోన్నతి పొందిన వారిని ఆయా జిల్లాలను కూడా కేటాయించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాకు సి.క్రాంతికుమార్‌గౌడ్, అబ్దుల్‌ఖాదర్, అహ్మద్‌మోయియోద్దీన్, జశ్వంత్‌కుమార్, కర్ణయ్య ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు నసీరోద్దీన్, కృష్ణవేణి, అంజద్‌అలీ, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, రామస్వామి, మాలతీ, శ్రీను, జ్యోత్స్న, నారాయణపేట జిల్లాకు కవితాబాయి, జ్యోత్స్న, రాఘవేందర్, విజయ్‌కుమార్, రాధాకృష్ణ, మానస, వనపర్తి జిల్లాకు గౌస్, అరుణ, బాలరామ్, రవికుమార్, మధుసూదన్‌గౌడ్, రహమాన్, గద్వాల్ జిల్లాకు షఫీక్, రాములు, రాజేష్, వెంకటేశ్వర్లు, నాగరాజు, సికిందర్‌ను కేటాయించారు.
పేదలపై పెనుభారం మోపుతున్న కేంద్రం
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతూ.. పేదలపై పెనుభారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. ధరల పెంపును నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో సామాన్యం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని రోజులుగా అడ్డగోలుగా పెంచుతున్న ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారి మహమ్మద్ అలీకి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్.ఆనంద్‌జీ, కేశవులుగౌడ్, తన్నీరు నర్సింహ, పెబ్బేటి విజయడు, ఈర్ల చంద్రమోళి, ఇందిరా, శంకర్‌గౌడ్, కృష్ణాజీ, శివుడు, ఖాజా, మల్లయ్య, సాయిలు పాల్గొన్నారు.


