వాగును తోడేస్తున్న ఇసుకాసురులు
రూ.వెయ్యి ఖర్చు పెట్టు.. రూ.18వేలు కొట్టు
జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సాండ్ ట్యాక్సీ విధానాన్ని నీరుగారుస్తూ.. అక్రమ దందాకు తెరలేపడం విమర్శలకు దారితీస్తోంది. ప్రైవేటు సాండ్ విధానం అనుమతి పొందిన వ్యక్తులు టిప్పర్‌కు రూ.వెయ్యి చొప్పున ఖర్చుచేసి.. రూ. 18వేలు సంపాదిస్తున్నారు. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా.. ప్రైవేటు సాండ్ అనుమతి పొందిన వ్యక్తులు వారి క్వారీ నుంచి పగలు కాకుండా రాత్రివేళ ఇసుక నింపి పంపిస్తు్‌ాన్నరు. నిత్యం 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక నింపడానికి ఇటాచ్‌కు రూ.వెయ్యి ఖర్చు అవుతుండగా.. టిప్పర్ యజమానుల నుంచి ఇసుక మాఫియా రూ. 18వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీన్ని ప్రకారం ఇసుక రీచ్‌లను పొందిన వ్యక్తులు నిత్యం రూ. 1.80లక్షల నుంచి రూ. 2.70లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదు. వీరు బహిరంగ మార్కెట్‌లో దూరం మేరకు రూ. 35వేల నుంచి రూ. 60వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
అచ్చంపేట: జిల్లాలోని దుందుభీ వాగు తీరంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోకవర్గాలను అనుసరించి ఉన్న దుందుభీ వాగులోని ఇసుక నాణ్యతకు పెట్టింది పేరు. ఇక్కడి ఇసుకకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఇదే అదునుగా వ్యాపారులు నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో వాగులో ఇసుకను తోడేస్తున్నారు. వాగు సమీపంలో భూగర్భజలాలు అడుగుంటున్నాయని ఇటీవల ఉప్పునుంతల మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేయగా.. ఆరు రోజుల క్రితం ఇదే మండలంలోని దాసర్లపల్లికి చెందిన రైతులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి దాసర్లపల్లికి చెందిన ఇసుక మాఫియా మధ్య గొడవ సైతం చోటుచేసుకుంది. ఈ ఒక్క గ్రామంలోనే రోజుకు రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల ఇసుక వ్యాపారం సాగిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
ఖాకీలకు కాసుల పంట..
దుందుభీ వాగు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తోంది. కొందరు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇసుక అక్రమ రవాణాలో పాలుపంచుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇసుక రవాణా రెవెన్యూ, మైనింగ్‌శాఖలకు సంబంధించిన అంశం.. తమకేం సంబంధం లేదని చెబుతూనే పోలీసులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ఇసుక వాహనం నుంచి నెలకు రూ. 15వేల నుంచి రూ. 25వేల వరకు దండుకుంటూ.. ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరూ కిమ్మనడం లేదు. కొందరు ప్రజాప్రతినిధుల మద్దతు సైతం ఉండటంతో ఆ ఖాకీలు ఆడిందే ఆటగా వ్యవహారం సాగుతోంది.
దాసర్లపల్లి సమీపంలోని దుందుభీ వాగులో ఇసుక తోడుతున్న దృశ్యం
అనుమతుల మాటున అక్రమ దందా
నిత్యం వందలాది వాహనాల్లో రవాణా
పలు ప్రాంతాల్లో వట్టిపోతున్న వాగు
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
ఏడాదిలో 300 రోజులపాటు
జిల్లాలోని తాడూరు, ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట, కల్వకుర్తి మండలాల మీదుగా దుందుభీ వాగు ప్రవహిస్తోంది. వాగు పరిసర గ్రామాల సరిహద్దుల్లోనే ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. భారీ వర్షాలు పడి వాగు పొంగిపొర్లితే తప్ప.. ఇక్కడ ఇసుక రవాణా ఆగదు. ఏడాదిలో దాదాపు 300 రోజులపాటు ఇసుక తవ్వుతారు. వాగు పరిధిలో అధికార, అనధికారికంగా 20 రీచ్‌ల వరకు ఉన్నాయి. అయితే ఆయా మండలాల్లోని ఠాణాల్లో పోస్టింగ్ కోసం కొందరు పోలీసులు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి ఒక్కసారి వచ్చాక వదలడానికి ససేమిరా అంటున్నారనే వాదన వినిపిస్తోంది. అప్పడప్పుడు మాత్రమే కొన్ని వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.


