● ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
కందనూలు/కొల్లాపూర్ రూరల్: జిల్లాలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, ఇతర అధికారులతో కలిసి నార్లాపూర్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకు ముందు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–3 కాల్వల నిర్మాణం, ప్యాకేజీ–2 పరిధిలోని డెలివరీ సిస్టమ్, ప్యాకేజీ–1లోని పంపుహౌజ్ నిర్మాణాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించే ప్రదేశాలు, ఆయనకు పథకం పురోగతిని వివరించే విధానం, భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం సోమశిలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షిస్తారని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం స్వయంగా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు వస్తున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్ పంప్‌హౌజ్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను నాగర్‌కర్నూల్, వనపర్తి ఎస్పీలు డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, సునీతారెడ్డితలతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. అనంతరం కుమ్మెర గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్షించారు. అక్కడ భద్రతా ప్రమాణాలు, వాహనాల పార్కింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలపై సీఎం భద్రతా అధికారులు పలు సూచనలు చేశారు.


