అచ్చంపేట రూరల్: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ.. పేద ప్రజలపై పెను భారాలు మోపుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బుధవారం అచ్చంపేటలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో ఎడ్లబండిపై తిరుగుతూ నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలు, అవకతవకలకు కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. దేశంలో ఉన్నత వర్గాల కోసమే బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. మూడు రోజులకోసారి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.


